Social Icons

Pages

మన దేవాలయాలు - సౌమ్యనాథస్వామి ఆలయం

 మన దేవాలయాలు - సౌమ్యనాథస్వామి ఆలయం

కడపజిల్లా నందలూరులోని సౌమ్యనాథస్వామి ఆలయానికి ఎంతో ప్రశస్తి ఉంది. అపురూప చోళకళా  సంపత్తికి ఆలవాలమైన క్షేత్రమిది. తాళ్లపాక కవులు సైతం తమ సంకీర్తనలతో స్వామిని కీర్తించి తరించారు.'చూడ నిన్నిటా జాణడు చొక్కనాథుడు వీడె మిచ్చె నాకునిదె వెన జొక్కనాథుడు.... 'చొల్లెపు జట్ల వో చొక్కనాథా నీ చుల్లరి చేతలు గంటి జొక్కనాథా'.... ఒకటా రెండా, అనేకానేక కీర్తనలతో తాళ్లపాక కవులు సౌమ్యనాథస్వామికి పదార్పన చేశారు. కడపజిల్లా నందలూరులో సౌమ్యనాథుడిగా పూజలందుకుంటున్న లక్ష్మీవల్లభుడి రూపం.... అపురూపం! సౌమ్య (శ్రీలక్ష్మి)కి నాథుడు కాబట్టి సౌమ్యనాథుడయ్యాడు. చొక్కానాథుడనీ స్వామికి పేరుంది. చూడచక్కనివాడని ఆ మాటకు అర్థం. తాళ్లపాక చినతిరుమలాచార్యుడు 'చెళ్ళపిళ్ళ రాయడ'ని కీర్తించాడు. చోళ శాసనాల్లో 'కులోత్తుంగ చోళ విన్నగర్' అని కొనియాడారు. ఏడడుగుల ఎత్తు దేవుడు - ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. నూటయాభై అడుగుల దూరం నుంచీ చూస్తున్నా ... గర్భాలయంలోని స్వామివారు కళ్లముందే నిలుచున్నంత స్పష్టంగా దర్శనమిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అంతే తేజస్సు. క్రీస్తుశకం పదకొండో శతాబ్దంలో కులోత్తుంగ చోళ మహారాజు నిర్మించాడీ ఆలయాన్ని. స్వామివారి విగ్రహం అంతకంటే పురాతనమైందని చెబుతారు. పది ఎకరాల విస్తీర్ణంలో... 180 స్తంభా లతో... చక్కని కళాకృతులతో అలరారుతున్న ఈ ఆలయానికి తెలుగువారే కాదు.... కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మూలవిరాట్టు పాదాల వద్ద వినమ్రమూర్తిగా నిలుచున్న ఆంజనేయుడే ఈ క్షేత్రపాలకుడు. 

తొమ్మిది ప్రదక్షిణలు ...

బలమైన కోరికతో, అంతకంటే బలమైన నమ్మికతో... ఓం శ్రీ సౌమ్యనాథాయ నమః' అంటూ గర్భగుడి చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి... మొక్కుకుంటే చాలు. అభీష్టాలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఇక్కడ ప్రత్యేక  పూజలు నిర్వహిస్తారు. అందుకే సంతాన సౌమ్యనాథుడనే పేరొచ్చింది. నందనందనుడు కొలువైన ఊరు కాబట్టే... ఈ గ్రామానికి నందలూరు అని పేరు వచ్చినట్లు ప్రసిద్ధి. నారసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించి... ప్రహ్లాదుడిని రక్షించిన తర్వాత కూడా స్వామివారి ఉగ్రరూపం అలానే ఉంటుంది. చెంచులక్ష్మి సాంగత్యంలో సింహరూపుడు శాంతమూర్తిగా మారతాడు. ఆయనే సౌమ్యనాథుడనీ చెబుతారు. ఆలయ సమీపంలో ప్రవహించే బాహుదా నదినే చెయ్యేరు అనీ పిలుస్తారు. ఈ నది ప్రాశస్త్యానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. శంఖ - లిఖితులనే అన్నదమ్ములు తీర్థయాత్రలు చేసుకుంటూ నందలూరు ప్రాంతానికి చేరుకుంటారు. తమ్ముడికి ఆకలేసి, ఓ మామిడి తోటలో పండ్లు కోసుకుని తింటాడు. ఆ విషయం రాజుగారికి తెలుస్తుంది.  అనుమతి లేకుండా తిన్నందుకు శిక్షగా రెండు చేతులూ నరికేయాలని ఆదేశిస్తాడు. రక్తమోడుతున్న సోదరుడితో కలిసి ఆ యాత్రికుడు సౌమ్యనాథస్వామి ఆలయానికొస్తాడు. దేవుడిని శరణువేడతారు. పక్కనే ఉన్న పుణ్య తీర్థంలో స్నానం చేసి రమ్మని ఆకాశవాణి పలుకుతుంది. ఆ నదిలో స్నానం చేయగానే స్వామి మహత్యంతో చేతులొచ్చాయి. 'బాహు' అంటే చేయి. 'ద' అంటే ఇవ్వడం అనే అర్థం ఉంది. అందుకే ఈ నదికి బాహుదా.. అనే పేరు స్థిరపడిందని చెబుతారు. బాహుదానది చిత్తూరు జిల్లాలో పుట్టి... నందలూరు ద్వారా ప్రవహిస్తూ సిద్ధవటం  మండలంలో పెన్నానదిలో కలుస్తుంది. ఈ నదీతీరంలో అనేక పుణ్యక్షేత్రాలు వెలిశాయి.  కడప నుంచి 45 కిలోమీటర్లూ, రాజంపేట నుంచి  10 కిలోమీటర్ల దూరంలో ఉందీ చారిత్రక ఆలయం.

 

Folk Songs

Tourist Places

Cultural Programme - Chekka Bhajana