Social Icons

Pages

Temples - జలధీశ్వరాలయం

 

శివపార్వతులు ఏకపీఠంపై!

        శివాలయం అంటే శివుడు ఒక చోట, పార్వతీదేవి మరోచోట ఉండటం సహజం. కానీ, ఆ క్షేత్రంలో ఇద్దరూ ఒకే చోట, ఏకపీఠంపై కొలువై ఉంటారు. అందుకే దాన్ని 'దక్షిణ కైలాసం' అని పిలుస్తారు. అదే కృష్ణాజిల్లాలోని జలధీశ్వరాలయం. 

                  పార్వతీ పరమేశ్వరులు హిమవత్పర్వతం పై ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. అదే కైలాసం. కానీ శివాలయాల్లో అలా కాదు. శివుడు ఒకచోట ఉంటే, అమ్మవారు మరోచోట ఉంటుంది. అన్ని శివాలయాల్లోనూ ఇంతే.కానీ, కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో ఆ ఆదిదంపతులిద్దరూ పక్కపక్కనే కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడి శివలింగమూ, అమ్మవారి విగ్రహమూ రెండూ పాలరాతితో చేసినవే కావడం విశేషం. 

అందుకే ఈస్వామిని... 

           “ఏకపీపీఠే  విరాజన్తం 

          సర్వమంగళయాసహ 

         ఘంటసాల పురాధీశం 

           జలధీశ్వరముపాస్మహే" - అని ప్రార్థిస్తారు ఇక్కడి భక్తులు, ఈ స్వామి ఆవిర్భావానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ చెబుతారు. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తరవాత పార్వతీదేవి హిమవంతుడి కుమార్తెగా పుట్టి, పరమశివుడి కోసం ఘోరతపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను పరిణయమాడాలని నిశ్చయించుకుంటాడు. వారి కల్యాణాన్ని చూసేందుకు సమస్త ప్రాణకోటీ ఉత్తరాపథానికి బయల్దేరుతుంది. దాంతో ఆ వైపు బరువు పెరిగిందట. తత్పలితంగా అది కుంగిపోసాగిందట. పరిస్థితిని గమనించిన పరమేశ్వరుడు అగస్త్య మహా మునిని పిలిచి... వెంటనే దక్షిణాపథానికి వెళ్లి ఒక పుణ్య ప్రదేశంలో తమ (పార్వతీ పరమేశ్వరుల)ను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించమని ఆదేశించాడట. అలా బయలు దేరిన అగస్త్యుడు ప్రస్తుతం ఘంటసాలగా పిలిచే ఈ ప్రాంతాన్ని పుణ్యప్రదేశంగా భావించి శివలింగాన్ని ప్రతిష్టించాలను కొన్నాడు. ఇక్కడి జలధి (సముద్రం) నుంచి తెల్లని లింగాకారంగా పరమశివుడు ఉద్భవించాడు. సాధారణంగా శైవక్షేత్రాల్లో శివుడు ఒకచోట, అమ్మవారు మరోచోట ప్రతిష్టితులు కావడాన్ని చూసిన అగస్త్యుడు... ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలపాలన్న ఉద్దేశంతో పార్వతీపరమేశ్వరులను ఏకపీఠంపై ప్రతిష్ఠించాడు. జలధి నుంచి ఉద్భవించిన ఈ స్వామి జలధీశ్వరుడయ్యాడు. అమ్మవారిని బాలపార్వతీదేవిగా కొలుస్తారు భక్తులు. 

       క్రీ.పూ.2050కి పూర్వమే.....

ఈ ఆలయ గర్భాలయం, అంతరాలయాలు ప్రత్యేక వాస్తు నిర్మాణంతో ఉంటాయి. ఆలయ విమాన శిఖరం... ఇతర ఆలయ శిఖరాలకు భిన్నంగా మూడు శిఖరాలతో గజపృష్టాకారం (ఏనుగు వెనుకభాగం)లో ఉంటుంది. ఈ ఆలయంలో పార్వతీపరమేశ్వరులు వెలసిన పీఠం క్రీస్తుపూర్వం 2050కంటే పూర్వంనాటిదని భారత పురావస్తుశాఖ కూడా ధ్రువీకరించింది.

      ఘంటసాలను క్రీ. శ. 9వ శతాబ్దంలో చోడపాండ్యపురంగా పిలిచేవారు. అప్పట్లో అభయాండశెట్టి అనే రాజు జలధీశ్వర దేవాల యానికి మండపాన్ని నిర్మించాడు. సముద్ర వ్యాపారులు జలధీశ్వరుడికి ఇచ్చిన దానాలకు సంబంధించిన శాసనాలను... నన్నయ మహాభారతం రాసిన నాటికంటే ముందు చేసిన శాసనాలుగా గుర్తించారు.

ఎలా చేరుకోవాలి :

        విజయవాడకు 70 కిలో మీటర్ల దూరంలో ఘంటసాలలో ఉంది జలధీశ్వరాలయం. విజయవాడ నుంచి అవనిగడ్డ బస్సు ఎక్కి విజయవాడ - చల్లపల్లి ప్రధాన రహదారిపై కొడాలి వద్ద బస్సు దిగాలి. అక్కణ్ణుంచి నాలుగు కిలో మీటర్లు వెళ్లే ఆలయం వస్తుంది. 

 

Folk Songs

Tourist Places

Cultural Programme - Chekka Bhajana