Social Icons

Pages

Temples - Hemachala Lakshmi Narsimha Swamy Temple

ఉగ్రనరసింహుడికి తైలాభిషేకం -  హేమాచల లక్ష్మీనారసింహుడు.

తొమ్మిది అడుగుల ఎత్తుండే ఆ స్వామి విగ్రహాన్ని తాకితే మెత్తగా.... సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. గట్టిగా నొక్కితే సొట్టలు కూడా పడతాయి. విగ్రహం నుంచి నిత్యం సన్నగా ఒకలాంటి ద్రవం వస్తుంది. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఆ విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకాలు జరుగుతాయి. శ్రీరాముడు దర్శించుకున్నాడని చెప్పే ఆ స్వామి వరంగల్ జిల్లాలోని హేమాచల లక్ష్మీనారసింహుడు.

చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం....ఆహ్లాదకరమైన వాతావరణం... మధ్యలో అర్ధచంద్రాకారంలో ఉండే ఎత్తైన కొండ.... ఆ కొండపైనే కొలువయ్యాడు లక్ష్మీ నారసింహుడు. మరో యాదగిరిగుట్టగా పిలిచే ఆ క్షేత్రమే హేమాచల లక్ష్మీ నారసింహ క్షేత్రం. ఇది వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో (వరంగల్ కు సుమారు 140 కి.మీ. దూరంలో) ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా వరంగల్ నుంచి మంగపేటకు వెళ్లాలి. అక్కణ్ణుంచి ఆటోలుంటాయి.

విగ్రహానికి దెబ్బ తగిలింది!
ఈ స్వామి ఆవిర్భావం రామాయణ కాలంలో జరిగిందని స్థలపురాణం. సీతాపహరణం జరిగిన తరవాత శ్రీరాముడు రుషుల ఆదేశానుసారం ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహుణ్ణి దర్శించుకున్నాడట. అలా స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
ఆ తరవాత ఒకానొక సమయంలో భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో పర్యటిస్తుండగా లక్ష్మీనరసింహస్వామి ఆయనకు కలలో కనిపించాడట. తాను హేమాద్రి గుట్టపై గుహలో ఉన్నానని చెప్పాడట. ఆ మహర్షి శిష్యబృందంతో తవ్వకాలు జరిపిస్తుండగా స్వామి విగ్రహానికి నాభి  ప్రాంతంలో దెబ్బ తగిలిందట.అప్పుడు లక్ష్మీనరసింహుడు ఉగ్రరూపంతో భరద్వాజుడికి దర్శనమిచ్చాడట. స్వామిని మహర్షి స్తుతించి శాంతింపజేసేసరికి గుహలోని గోడపై నిలువెత్తు స్వామిరూపం  - ప్రత్యక్షమైంది. ఉగ్ర నరసింహస్వామి ... అంతర్థానమయ్యాడు. అప్పటికీ స్వామి నాభి  ప్రాంతం నుంచి రక్తం వస్తోందట. అప్పుడు  పసుపుతో కట్టుకట్టారట. , కానీ, స్రావం మాత్రం ఆగలేదు. ఇప్పటికీ ఒక రకమైన ద్రవం స్వామి నాభి భాగం నుంచి వస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడానికి నేటికీ చందనం పెడుతూంటారు.
             
రుద్రమదేవి కోలుకుంది
ఈ ఆలయంలోని మరో విశేషం...ఎలా వస్తుందో తెలియదుగానీ స్వామివారి  ఎడమపాదం నుంచి నిత్యం జలం వస్తుంది. ఈ నీరు గుట్టకింద గోముఖాన్ని పోలిన ప్రతిమ నుంచి బయటకు వెళుతుంది.
                 శాతవాహనుల తరవాత కాకతీయుల కాలంలో రుద్రమదేవి పాలనలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందిందట. అప్పట్లో రుద్రమదేవి హేమాచల ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిందట. లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుంచి వస్తున్న సెలయేరులో స్నానంచేస్తే రోగం నయమవుతుందని కలలో ఆమెకు అదృశ్యవాణి చెప్పిందట. వెంటనే ఆమె ఆ సెలయేటి నీటిని తాగి, అందులో స్నానంచేస్తే ఆరోగ్యం కుదుటపడిందట.ఇంత మహిమాన్వితమైన ఈ జలధార వృథా పోకూడదని భావించి రుద్రమదేవి  ఇక్కడ కోనేటిని తవ్వించి, స్వామికి చింతామణి హారాన్ని బహూకరించిందట. అప్పటినుంచే ఈ సెలయేటికి చింతామణి సెలయేరు అని పేరు వచ్చిందని చెబుతారు.
         
గ్రామాలు లేవు
గతంలో ఈ ఆలయానికి సమీపంలో చాలా గ్రామాలు ఉండేవి. కానీ, అవి ఎప్పుడు పడితే అప్పుడు తగలబడిపోయేవి. దాంతో అప్పటి శాతవాహన రాజులు గ్రామాలను ఆలయానికి  దూరంగా తరలించారు. ఆ తరవాత గ్రామాల్లో ఎలాంటి అగ్నిప్రమాదాలూ జరగలేదట. అందుకే, ఈ ఆలయానికి సుమారు అయిదు కిలోమీటర్ల పరిధిలో నేటికీ గ్రామాలు లేవు.
ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.
            ఈ ఆలయానికి అష్టదిక్కుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండటం విశేషం. తనకు ప్రియమైన లక్ష్మీనారసింహుణ్ణి నిత్యం చూసుకునేందుకు హనుమ ఇలా వెలిశాడని చెబుతారు. 
                సాధారణంగా దేవాలయాల్లో పంచామృతాలతోనూ జలంతోనూ విగ్రహాలకు అభిషేకం చేస్తారు. కానీ, ఈ స్వామికి ప్రతి శని, ఆది, సోమవారాల్లో నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. దక్షిణ భారతదేశంలో మరే ఆలయంలోనూ ఇలా జరగదు. 
 

Folk Songs

Tourist Places

Cultural Programme - Chekka Bhajana