ఆదిశంకరుడు ఇక్కడికొచ్చాడు, గరుత్మంతుడు ఇటుగా వెళ్లాడు. ఈ సరస్సు ఒడ్డునే హనుమంతుడు తన బలాన్ని చూపాడు. త్రిమూర్తుల రాకకు సాక్ష్యంగా పాదముద్రలూ కనిపిస్తాయి.ఆ తీర్థస్థలి హరిహర క్షేత్రం... పుష్పగిరి.
హరిహరుల మధ్య అభేద్యాన్ని చాటిన పవిత్ర క్షేత్రం పుష్పగిరి. శిల్పకళా వైభవంలో రెండో హంపీగా పేరున్న పుష్ప గిరిలో ఒకప్పుడు, 108 శివాల యాలు ఉండేవట. వీటిల్లో వైద్య నాథేశ్వర, త్రికూటేశ్వర, భీమేశ్వర, కామాక్షి, చెన్నకేశవస్వామి ఆలయాలు ప్రధానమైనవి. జిల్లా కేంద్రం కడప నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో.. పంచనదీ సంగమంగా పిలుచు కునే పవిత్ర పినాకినీ తీరంలోని పుష్పగిరిలో... హరుడు వైద్యనా థేశ్వరస్వామిగా, నదికి ఆవల వైపు కొండమీద శ్రీహరి చెన్న కేశ వస్వామిగా కొలువుదీరారు. చోళులు నిర్మించిన ఈ క్షేత్రాన్ని కాకతీయులూ విజయనగర రాజులూ అభివృద్ధి చేశారు.
పేరు వెనుక చరిత్ర ...
పుష్పగిరి స్థానంలో పూర్వం కాంపల్లె అనే గ్రామం ఉండేది. పల్లె పక్కనే మంచినీటి సరస్సు ఉండేది. గరుత్మంతుడు తన తల్లి శాపవిమోచనార్థం స్వర్గం నుంచి అమృత కలశాన్ని తీసుకొస్తుండగా ఇంద్రుడు వజ్రా యుధాన్ని ప్రయోగించాడు. ఆ ధాటికి గరుత్మంతుడి చేతిలోని అమృత కలశం తొణికింది. అందులోంచి ఓ బిందువు సరస్సులో పడింది. ఆ ప్రభా వంతో సరస్సు మొత్తం సంజీవనీ జలమైంది. అటుగా వెళ్తున్న ఓ వద్ద రైతు తన ఎద్దులను సరస్సు లోకి దింపి నీళ్లు తాగించాడు. అమృతం ప్రభావంతో ముసలి ఎద్దులు కాస్తా కోడె గిత్తలుగా మారాయి. రైతు ఆశ్చర్య పోయాడు. తానూ గుక్కెడు నీళ్లుతాగి చూశాడు... మరుక్షణమే యువకుడైపోయాడు. ఆ సంగతి తెలిసి ఊరంతా సరస్సులో మునకలేసింది. అంతా యవ్వనవంతులయ్యారు. విషయం దేవతలకు తెలిసింది. ఆంజనేయ స్వామిని పిలిచి...సరస్సును పెద్దకొండతో మూసేయమని ఆదేశించారు. మారుతి ప్రయత్నం ఫలించలేదు. కొండ నీటిలో పూవులా తేలిపోయింది. దీంతో త్రిమూర్తులే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పటి నుంచీ 'నీళ్లలో పుష్పంలా తేలిన కొండ' అన్న అర్థం వచ్చేలా కాంపల్లె పుష్పగిరిగా మారిపోయింది.
ఎన్నో ఆలయాలు...
కిందనున్న వైద్యనాథేశ్వర స్వామి ఆలయాన్ని కొండమీదున్న చెన్నకేశవస్వామి ఆలయాన్నీ జనమేజయ మహారాజు నిర్మించాడని అంటారు. శ్రీకృష్ణ దేవరాయలు పుష్పగిరిని దర్శించుకున్నాడు. కొండ మీద 108 శివాలయాలు ఉండటంతో శ్రావణమాసంలో పినాకినీ నదిలో స్నానమాచరించి హరిహరులకు పూజలు చేస్తే.. 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణ ప్రస్తావన. ఆది శంకరులు పుష్పగిరి పీఠంతో పాటు శ్రీచక్రాన్నీ ప్రతిష్ఠించారు. పరమేశ్వరుడు జగద్గురువుకు ప్రసాదించిన మహిమాన్విత స్పటికలింగం పుష్పగిరిలో నిత్య పూజలందుకొంటోంది. పదహారో శతాబ్దం వరకూ వేదఘోషతో కళకళలా డిన పుష్పగిరి అగ్రహారం కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి కోపాగ్నికి బలైందని చెబుతారు. పర్యటనలో భాగంగా ఇక్కడికొచ్చిన వీరబ్రహ్మేంద్రుడిని అగ్రహారీకులు హేళన చేశారట. దీంతో ఆగ్రహించిన బ్రహ్మంగారు అగ్రహార వైభవమంతా నాశనమౌతుందని శాపమిచ్చాడట. మళ్లీ ఈ క్షేత్రంలో కాకి కనిపించేంతవరకూ, మర్రిమాను మొలిచే వరకూ శాపవిమోచనం లేదనీ సెలవిచ్చాడట. దీంతో దాదాపు 200 ఏళ్లపాటూ పుష్పగిరి పీఠం, చెన్నకేశవ స్వామి ఆలయం ప్రాభవాన్ని కోల్పోయాయి. పందొమ్మిదో శతాబ్దం నుంచీ నెమ్మదిగా అభివృద్ధి బాట పట్టాయి. పుష్ప గిరి ఆర్యవైశ్య సత్రంలో ప్రస్తుతం ఒక మర్రిచెట్టు ఎదుగుతోంది.బ్రహ్మంగారి శాపవిమోచన కాలం వచ్చిందనీ, పుష్పగిరికి పూర్వ వైభవం ఖాయమనీ భక్తుల విశ్వాసం.