శ్రీ పట్టాభిరామాలయం, వాల్మీకిపురం (వాయల్పాడు)
ఈ ఆలయ ప్రాంతంలో వావిలి చెట్లు అధికంగా ఉండటం చేత ఈ పట్టణానికి "వావిలిపాడు" అను పేరు వచ్చినది. ముస్లిం నవాబుల పరిపాలనలో ఈ పట్టణం "వావిల్ - క - పహాడ్" అని పిలువబడింది. ఇది ఆంగ్లేయుల పరిపాలనలో "వాయల్ పాడ్ " గా పిలవబడింది.
పూర్వం ఈ ప్రాంతంలోని నూరు కొప్పుల కొండదరిలో బాహుదానది ఒడ్డున శ్రీమద్రామాయణ గ్రంథకర్త వాల్మీకి మహర్షి ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసినారని వినికిడి. వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో వెలసిన ఈ పట్టణానికి "వాల్మీకిపురం" అని పేరు కలిగిందని చెపుతారు.
పూర్వము వావిలిపాడు, వాయల్పాడు గా పిలువబడిన ఈ పట్టణం నేడు "వాల్మీకిపురం" గా ప్రసిద్ధి.
ఆలయ వైభవం:
త్రేతాయుగంలో శ్రీరామభక్తుడైన జాంబవంతుడు ఈ ఆలయంలోని మూలవరులను ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెపుతున్నది. ప్రధాన ఆలయమైన శ్రీపట్టాభిరామాలయంలో ముందు మహామండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయం క్రమంగా ఉన్నాయి. మహామండప స్తంభాలపై రమణీయమైన దేవతా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్తంభాలలో కొన్ని చోళ, మరికొన్ని విజయనగర శిల్పశైలిలో మలచబడి ఉన్నాయి.
మహామండపమునకు ముందు 4 స్తంభాలతో ముఖ మండపం నిర్మిపబడింది. మండపం పై కప్పులో భువనేశ్వరిలో ఏర్పరచిన స్వస్తిక చిహ్నం, మధ్యలోని అధః పద్మం ఉన్నాయి. ముఖమండపంనకు ఎడంవైపున గల ఉపాలయంలో వీరాంజనేయస్వామి శిలావిగ్రహం పశ్చిమాభిముఖంగా ప్రతిష్టింపబడి ఉంది.
దేవతా వైభవం:
ఈ దేవాలయంలో శ్రీరాముడు ప్రధాన దైవం. గర్భగుడిలో పూర్వాభిముఖుడైన స్వామికి కుడివైపున సీత, వింజామరతో భరతుడు ఉన్నారు. స్వామికి ఎడమవైపున ధనుర్భాణాలతో లక్ష్మణుడు, వింజామరతో శత్రఘ్నుడు ఉన్నారు. పెండ్లికి పూర్వపద్ధతులలో వధువు వరుడి కుడివైపున నిలిచేది సంప్రదాయం. ఈ పద్దతిలోనే ఇక్కడ సీత రాముడికి కుడివైపు నిలిచింది. ఆంజనేయుడు సన్నిధిలో లేని దానికి ఇదే కారణం కావచ్చు. ఈ ఆలయంలో శ్రీరాముడు తనది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని - ఇది నా వ్రతమని చాటుతున్నట్లు తన కుడిచేతి చూపుడు వేలు పై కెత్తి సూచీముఖ హస్త ముద్రతో శాసన ముద్రతో కనిపిస్తున్నాడు. ఇక్కడ గర్భగుడి ద్వారబంధం శిలలో దశావతార శిల్పాలను చెక్కి ఉండటం ఒక విశేషం.
ఈ పట్టాభిరామాలయానికి పశ్చిమదిశలో దక్షిణ ముఖంగా శ్రీరంగనాథుని ఆలయం ఉంది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేతుడైన రంగనాథుని శయనమూర్తి కొలువై ఉంది. ఆలయం వెలుపల పశ్చిమముఖంగా శ్రీ పాండురంగవిఠల ఆలయం ఉంది. శ్రీ పట్టాభిరామాలయానికి తూర్పున కొద్దిదూరంలో పుష్కరిణి ఉంది. దీనిని "గరుడ పుష్కరిణి " అని పిలుస్తారు. ఈ పుష్కరిణి లో ట్టాభిరాముని ఉత్సవాలు జరిగేవి.
ఈ వాల్మీకి పురం తిరుపతి - మదనపల్లి మార్గంలో, తిరుపతి నుండి 94 కి.మీ దూరంలో ఉంది.