Social Icons

Pages

Featured Posts

Temples - Hemachala Lakshmi Narsimha Swamy Temple

ఉగ్రనరసింహుడికి తైలాభిషేకం -  హేమాచల లక్ష్మీనారసింహుడు.

తొమ్మిది అడుగుల ఎత్తుండే ఆ స్వామి విగ్రహాన్ని తాకితే మెత్తగా.... సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. గట్టిగా నొక్కితే సొట్టలు కూడా పడతాయి. విగ్రహం నుంచి నిత్యం సన్నగా ఒకలాంటి ద్రవం వస్తుంది. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఆ విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకాలు జరుగుతాయి. శ్రీరాముడు దర్శించుకున్నాడని చెప్పే ఆ స్వామి వరంగల్ జిల్లాలోని హేమాచల లక్ష్మీనారసింహుడు.

చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం....ఆహ్లాదకరమైన వాతావరణం... మధ్యలో అర్ధచంద్రాకారంలో ఉండే ఎత్తైన కొండ.... ఆ కొండపైనే కొలువయ్యాడు లక్ష్మీ నారసింహుడు. మరో యాదగిరిగుట్టగా పిలిచే ఆ క్షేత్రమే హేమాచల లక్ష్మీ నారసింహ క్షేత్రం. ఇది వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో (వరంగల్ కు సుమారు 140 కి.మీ. దూరంలో) ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా వరంగల్ నుంచి మంగపేటకు వెళ్లాలి. అక్కణ్ణుంచి ఆటోలుంటాయి.

విగ్రహానికి దెబ్బ తగిలింది!
ఈ స్వామి ఆవిర్భావం రామాయణ కాలంలో జరిగిందని స్థలపురాణం. సీతాపహరణం జరిగిన తరవాత శ్రీరాముడు రుషుల ఆదేశానుసారం ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహుణ్ణి దర్శించుకున్నాడట. అలా స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
ఆ తరవాత ఒకానొక సమయంలో భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో పర్యటిస్తుండగా లక్ష్మీనరసింహస్వామి ఆయనకు కలలో కనిపించాడట. తాను హేమాద్రి గుట్టపై గుహలో ఉన్నానని చెప్పాడట. ఆ మహర్షి శిష్యబృందంతో తవ్వకాలు జరిపిస్తుండగా స్వామి విగ్రహానికి నాభి  ప్రాంతంలో దెబ్బ తగిలిందట.అప్పుడు లక్ష్మీనరసింహుడు ఉగ్రరూపంతో భరద్వాజుడికి దర్శనమిచ్చాడట. స్వామిని మహర్షి స్తుతించి శాంతింపజేసేసరికి గుహలోని గోడపై నిలువెత్తు స్వామిరూపం  - ప్రత్యక్షమైంది. ఉగ్ర నరసింహస్వామి ... అంతర్థానమయ్యాడు. అప్పటికీ స్వామి నాభి  ప్రాంతం నుంచి రక్తం వస్తోందట. అప్పుడు  పసుపుతో కట్టుకట్టారట. , కానీ, స్రావం మాత్రం ఆగలేదు. ఇప్పటికీ ఒక రకమైన ద్రవం స్వామి నాభి భాగం నుంచి వస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడానికి నేటికీ చందనం పెడుతూంటారు.
             
రుద్రమదేవి కోలుకుంది
ఈ ఆలయంలోని మరో విశేషం...ఎలా వస్తుందో తెలియదుగానీ స్వామివారి  ఎడమపాదం నుంచి నిత్యం జలం వస్తుంది. ఈ నీరు గుట్టకింద గోముఖాన్ని పోలిన ప్రతిమ నుంచి బయటకు వెళుతుంది.
                 శాతవాహనుల తరవాత కాకతీయుల కాలంలో రుద్రమదేవి పాలనలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందిందట. అప్పట్లో రుద్రమదేవి హేమాచల ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిందట. లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుంచి వస్తున్న సెలయేరులో స్నానంచేస్తే రోగం నయమవుతుందని కలలో ఆమెకు అదృశ్యవాణి చెప్పిందట. వెంటనే ఆమె ఆ సెలయేటి నీటిని తాగి, అందులో స్నానంచేస్తే ఆరోగ్యం కుదుటపడిందట.ఇంత మహిమాన్వితమైన ఈ జలధార వృథా పోకూడదని భావించి రుద్రమదేవి  ఇక్కడ కోనేటిని తవ్వించి, స్వామికి చింతామణి హారాన్ని బహూకరించిందట. అప్పటినుంచే ఈ సెలయేటికి చింతామణి సెలయేరు అని పేరు వచ్చిందని చెబుతారు.
         
గ్రామాలు లేవు
గతంలో ఈ ఆలయానికి సమీపంలో చాలా గ్రామాలు ఉండేవి. కానీ, అవి ఎప్పుడు పడితే అప్పుడు తగలబడిపోయేవి. దాంతో అప్పటి శాతవాహన రాజులు గ్రామాలను ఆలయానికి  దూరంగా తరలించారు. ఆ తరవాత గ్రామాల్లో ఎలాంటి అగ్నిప్రమాదాలూ జరగలేదట. అందుకే, ఈ ఆలయానికి సుమారు అయిదు కిలోమీటర్ల పరిధిలో నేటికీ గ్రామాలు లేవు.
ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.
            ఈ ఆలయానికి అష్టదిక్కుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండటం విశేషం. తనకు ప్రియమైన లక్ష్మీనారసింహుణ్ణి నిత్యం చూసుకునేందుకు హనుమ ఇలా వెలిశాడని చెబుతారు. 
                సాధారణంగా దేవాలయాల్లో పంచామృతాలతోనూ జలంతోనూ విగ్రహాలకు అభిషేకం చేస్తారు. కానీ, ఈ స్వామికి ప్రతి శని, ఆది, సోమవారాల్లో నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. దక్షిణ భారతదేశంలో మరే ఆలయంలోనూ ఇలా జరగదు. 

Best Visiting Places: పంచభూత లింగాలు

 పంచభూత లింగాలు 

లయకారుడైన శివుడిని ఎక్కడ వెదకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థలదేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం వారి జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడి దేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొం దుతున్నాయి. 

ఆకాశ లింగం... నటరాజస్వామి ఆలయం:


 తమిళనాడు శివాలయాలకు పుట్టిల్లు అని చెప్పవచ్చు. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉండగా, ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలువు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. చోళ, పాండ్య చక్రవర్తులు శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ వెలుగొందు తుంటాయి.  చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం ఉంది. 

పృథ్వీ లింగం ...ఏకాంబరేశ్వరాలయం:

భారతదేశంలో అతి పెద్ద గోవురాలలో ఈ ఆలయం ఒకటి. కంచి ఉత్తరభాగాన్ని శివకంచి అంటారు. పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ(భూమి)కి సూచికగా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద స్వామి వెలసాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని, ఈ స్వామి భూమిని సూచిస్తాడు అని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం  ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం. 

వాయు లింగం.... శ్రీకాళహస్తీశ్వరాలయం:

స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. ఆ విధంగా ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ది చెందింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈ మూడు పేర్లతో ప్రసిద్ది చెందింది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అని కూడా  అంటారు. మహాశివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది.

జల లింగం.... జంబుకేశ్వరాలయం:

తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం జలం ను సూచిస్తుంది. ఏనుగుల చేత పూజలందుకుంటున్న క్షేత్రం అనీ, జంబు వృక్షాలు  (తెల్లనేరేడు) అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానపట్టం ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి, ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడ నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు. 

అగ్ని లింగం .... అరుణాచలేశ్వరాలయం:

 దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్ని భూత లింగానికి అరుణాచలేశ్వరాలయం ప్రతీక. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. తేజోలింగం కనుక ఈ లింగాన్ని  అగ్ని క్షేత్రం అని కూడా అంటారు. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలువుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది. చెన్నై నుంచి 185 కి.మీ దూరంలో ఉన్న అరుణాచలేశ్వరాలయం. తిరుపతి నుంచీ రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

Pushpagiri Temple in Kadapa


 

ఆదిశంకరుడు ఇక్కడికొచ్చాడు, గరుత్మంతుడు ఇటుగా వెళ్లాడు. ఈ సరస్సు ఒడ్డునే హనుమంతుడు తన బలాన్ని చూపాడు. త్రిమూర్తుల రాకకు సాక్ష్యంగా పాదముద్రలూ కనిపిస్తాయి.ఆ తీర్థస్థలి హరిహర క్షేత్రం... పుష్పగిరి. 

                హరిహరుల మధ్య అభేద్యాన్ని చాటిన పవిత్ర క్షేత్రం పుష్పగిరి. శిల్పకళా వైభవంలో రెండో హంపీగా పేరున్న పుష్ప గిరిలో ఒకప్పుడు, 108 శివాల యాలు ఉండేవట. వీటిల్లో వైద్య నాథేశ్వర, త్రికూటేశ్వర, భీమేశ్వర, కామాక్షి, చెన్నకేశవస్వామి ఆలయాలు ప్రధానమైనవి. జిల్లా కేంద్రం కడప నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో.. పంచనదీ సంగమంగా పిలుచు కునే పవిత్ర పినాకినీ తీరంలోని పుష్పగిరిలో... హరుడు వైద్యనా థేశ్వరస్వామిగా, నదికి ఆవల వైపు కొండమీద శ్రీహరి చెన్న కేశ వస్వామిగా కొలువుదీరారు. చోళులు నిర్మించిన ఈ క్షేత్రాన్ని కాకతీయులూ విజయనగర రాజులూ అభివృద్ధి చేశారు. 

పేరు వెనుక చరిత్ర ...

పుష్పగిరి స్థానంలో పూర్వం కాంపల్లె అనే గ్రామం ఉండేది. పల్లె పక్కనే మంచినీటి సరస్సు ఉండేది. గరుత్మంతుడు తన తల్లి శాపవిమోచనార్థం స్వర్గం నుంచి అమృత కలశాన్ని తీసుకొస్తుండగా ఇంద్రుడు వజ్రా యుధాన్ని ప్రయోగించాడు. ఆ ధాటికి గరుత్మంతుడి చేతిలోని అమృత కలశం తొణికింది. అందులోంచి ఓ బిందువు సరస్సులో పడింది. ఆ ప్రభా వంతో సరస్సు మొత్తం సంజీవనీ జలమైంది. అటుగా వెళ్తున్న ఓ వద్ద రైతు తన ఎద్దులను సరస్సు లోకి దింపి నీళ్లు తాగించాడు. అమృతం ప్రభావంతో ముసలి ఎద్దులు కాస్తా కోడె గిత్తలుగా మారాయి. రైతు ఆశ్చర్య పోయాడు. తానూ గుక్కెడు నీళ్లుతాగి చూశాడు... మరుక్షణమే యువకుడైపోయాడు. ఆ సంగతి తెలిసి ఊరంతా సరస్సులో మునకలేసింది. అంతా యవ్వనవంతులయ్యారు. విషయం దేవతలకు తెలిసింది. ఆంజనేయ స్వామిని పిలిచి...సరస్సును పెద్దకొండతో మూసేయమని ఆదేశించారు. మారుతి ప్రయత్నం ఫలించలేదు. కొండ నీటిలో పూవులా తేలిపోయింది. దీంతో త్రిమూర్తులే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పటి నుంచీ 'నీళ్లలో పుష్పంలా తేలిన కొండ' అన్న అర్థం వచ్చేలా కాంపల్లె పుష్పగిరిగా మారిపోయింది. 

ఎన్నో ఆలయాలు...

కిందనున్న వైద్యనాథేశ్వర స్వామి ఆలయాన్ని కొండమీదున్న చెన్నకేశవస్వామి ఆలయాన్నీ జనమేజయ మహారాజు నిర్మించాడని అంటారు. శ్రీకృష్ణ దేవరాయలు పుష్పగిరిని దర్శించుకున్నాడు. కొండ మీద 108 శివాలయాలు ఉండటంతో శ్రావణమాసంలో పినాకినీ నదిలో స్నానమాచరించి హరిహరులకు పూజలు చేస్తే.. 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణ ప్రస్తావన. ఆది శంకరులు పుష్పగిరి పీఠంతో పాటు శ్రీచక్రాన్నీ ప్రతిష్ఠించారు. పరమేశ్వరుడు జగద్గురువుకు ప్రసాదించిన మహిమాన్విత స్పటికలింగం పుష్పగిరిలో నిత్య పూజలందుకొంటోంది. పదహారో శతాబ్దం వరకూ వేదఘోషతో కళకళలా డిన పుష్పగిరి అగ్రహారం కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి కోపాగ్నికి బలైందని చెబుతారు. పర్యటనలో భాగంగా ఇక్కడికొచ్చిన వీరబ్రహ్మేంద్రుడిని అగ్రహారీకులు హేళన చేశారట. దీంతో ఆగ్రహించిన బ్రహ్మంగారు అగ్రహార వైభవమంతా నాశనమౌతుందని శాపమిచ్చాడట. మళ్లీ ఈ క్షేత్రంలో కాకి కనిపించేంతవరకూ, మర్రిమాను మొలిచే వరకూ శాపవిమోచనం లేదనీ సెలవిచ్చాడట. దీంతో దాదాపు 200 ఏళ్లపాటూ పుష్పగిరి పీఠం, చెన్నకేశవ స్వామి ఆలయం ప్రాభవాన్ని కోల్పోయాయి. పందొమ్మిదో శతాబ్దం నుంచీ నెమ్మదిగా అభివృద్ధి బాట పట్టాయి. పుష్ప గిరి ఆర్యవైశ్య సత్రంలో ప్రస్తుతం ఒక మర్రిచెట్టు ఎదుగుతోంది.బ్రహ్మంగారి శాపవిమోచన కాలం వచ్చిందనీ, పుష్పగిరికి పూర్వ వైభవం ఖాయమనీ భక్తుల విశ్వాసం.

Our Temples - Sri Pattabhiramalayam, Valmikipuram

శ్రీ పట్టాభిరామాలయం, వాల్మీకిపురం (వాయల్పాడు)
ఈ ఆలయ ప్రాంతంలో వావిలి చెట్లు అధికంగా ఉండటం చేత ఈ పట్టణానికి "వావిలిపాడు" అను పేరు వచ్చినది. ముస్లిం నవాబుల పరిపాలనలో ఈ పట్టణం "వావిల్ - క - పహాడ్" అని పిలువబడింది. ఇది ఆంగ్లేయుల పరిపాలనలో "వాయల్ పాడ్ " గా పిలవబడింది. 
                            పూర్వం ఈ ప్రాంతంలోని నూరు కొప్పుల కొండదరిలో బాహుదానది ఒడ్డున శ్రీమద్రామాయణ గ్రంథకర్త వాల్మీకి మహర్షి ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసినారని వినికిడి. వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో వెలసిన ఈ పట్టణానికి "వాల్మీకిపురం" అని పేరు కలిగిందని చెపుతారు. 
                  పూర్వము వావిలిపాడు, వాయల్పాడు గా పిలువబడిన ఈ పట్టణం నేడు "వాల్మీకిపురం" గా ప్రసిద్ధి. 
ఆలయ వైభవం:
                              త్రేతాయుగంలో శ్రీరామభక్తుడైన జాంబవంతుడు ఈ ఆలయంలోని మూలవరులను ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెపుతున్నది. ప్రధాన ఆలయమైన శ్రీపట్టాభిరామాలయంలో ముందు మహామండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయం క్రమంగా ఉన్నాయి. మహామండప స్తంభాలపై రమణీయమైన దేవతా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్తంభాలలో కొన్ని చోళ, మరికొన్ని విజయనగర శిల్పశైలిలో మలచబడి ఉన్నాయి. 
                        మహామండపమునకు ముందు 4 స్తంభాలతో ముఖ మండపం నిర్మిపబడింది. మండపం పై కప్పులో భువనేశ్వరిలో ఏర్పరచిన స్వస్తిక చిహ్నం, మధ్యలోని అధః పద్మం ఉన్నాయి. ముఖమండపంనకు ఎడంవైపున గల ఉపాలయంలో వీరాంజనేయస్వామి శిలావిగ్రహం పశ్చిమాభిముఖంగా ప్రతిష్టింపబడి ఉంది. 
దేవతా  వైభవం:
ఈ దేవాలయంలో శ్రీరాముడు ప్రధాన దైవం. గర్భగుడిలో పూర్వాభిముఖుడైన స్వామికి కుడివైపున సీత, వింజామరతో భరతుడు ఉన్నారు. స్వామికి ఎడమవైపున ధనుర్భాణాలతో లక్ష్మణుడు, వింజామరతో శత్రఘ్నుడు ఉన్నారు. పెండ్లికి పూర్వపద్ధతులలో వధువు వరుడి కుడివైపున నిలిచేది సంప్రదాయం. ఈ పద్దతిలోనే ఇక్కడ సీత రాముడికి కుడివైపు నిలిచింది. ఆంజనేయుడు సన్నిధిలో లేని దానికి ఇదే కారణం కావచ్చు. ఈ ఆలయంలో శ్రీరాముడు తనది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని - ఇది నా  వ్రతమని  చాటుతున్నట్లు తన కుడిచేతి చూపుడు వేలు పై కెత్తి సూచీముఖ హస్త ముద్రతో శాసన ముద్రతో కనిపిస్తున్నాడు. ఇక్కడ గర్భగుడి ద్వారబంధం శిలలో దశావతార శిల్పాలను చెక్కి ఉండటం ఒక విశేషం. 
                                    ఈ పట్టాభిరామాలయానికి పశ్చిమదిశలో దక్షిణ ముఖంగా శ్రీరంగనాథుని ఆలయం ఉంది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేతుడైన రంగనాథుని శయనమూర్తి కొలువై ఉంది. ఆలయం వెలుపల పశ్చిమముఖంగా శ్రీ పాండురంగవిఠల ఆలయం ఉంది. శ్రీ పట్టాభిరామాలయానికి తూర్పున కొద్దిదూరంలో పుష్కరిణి ఉంది. దీనిని "గరుడ పుష్కరిణి " అని పిలుస్తారు. ఈ పుష్కరిణి లో ట్టాభిరాముని ఉత్సవాలు జరిగేవి. 
 ఈ వాల్మీకి పురం తిరుపతి - మదనపల్లి మార్గంలో, తిరుపతి నుండి 94 కి.మీ దూరంలో ఉంది. 

Sightseeing place - Urukunda veeranna temple

This video represents a journey through a famous historical temple, the many wonders of the temple, a scope of some forgotten lands and many more interesting facts about the temple. You can know about more famous temples through the upcoming videos.
 

Folk Songs

Tourist Places

Cultural Programme - Chekka Bhajana